కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ తెలంగాణకు ఎన్నికలు పది రోజుల్లో తేలుస్తాం


అంతా సిద్ధమైతే 4 రాష్ట్రాల కంటే ముందే తెలంగాణకు ఎన్నికలు
రద్దయిన అసెంబ్లీకి తొలుత ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం రూలింగ్‌ ఉంది...
ఎన్నికల షెడ్యూల్‌ గురించి కేసీఆర్‌ మాట్లాడటం సరికాదు
అది పూర్తిగా ఎన్నికల కమిషన్‌ పరిధిలోని అంశం
ఎన్నికలకు సిద్ధమని తెలంగాణ సీఈవో నివేదిక పంపారు
దాన్ని ఆడిట్‌ చేయడానికి బృందాన్ని పంపుతున్నాం
ఓటర్ల జాబితా సమస్య కాదు
 కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌
నవంబరులో ఎన్నికలు, డిసెంబరులో ఫలితాలంటూ కేసీఆర్‌ మాట్లాడటం గర్హనీయం. వ్యక్తులు, రాజకీయ నాయకులు, భవిష్యవాణిల ప్రకారం ఎన్నికల సంఘం నడుచుకోదు. ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషన్‌ సమర్ధించదు’
ఎన్నికల విషయమై కేసీఆర్‌ నన్నెప్పుడూ కలవలేదు. నాతో మాట్లాడనూ లేదు’
తొలుత సుప్రీం రూలింగ్‌ను, తర్వాత ఎన్నికల సన్నద్ధతను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ విషయంలో వారం పది రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తాం. తెలంగాణ శాసనసభ అకస్మాత్తుగా రద్దయిన క్రమంలో.. సీఈవో ద్వారా నివేదిక తెప్పించుకుంటున్నాం.
శాసనసభ అర్ధంతరంగా రద్దయినప్పుడు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని 2002లో సుప్రీంకోర్టు రూలింగ్‌ ఇచ్చిందనీ, తదనుగుణంగా తెలంగాణ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల శాసనసభలతోపాటే తెలంగాణకూ ఎన్నికలు నిర్వహించడంపై ఇప్పుడే తామేమీ చెప్పలేమన్నారు. ఆ రాష్ట్రాల ఎన్నికల సన్నద్ధత చాలా వేగంగా సాగుతోందనీ, తెలంగాణ యంత్రాంగం వాటిని అందుకుంటే సరి, లేదంటే వాటితోపాటు వెళ్లలేమని స్పష్టం చేశారు. ‘నవంబరులో ఎన్నికలుంటాయి.. డిసెంబరులో ఫలితాలు వెల్లడవుతాయి’ అన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎన్నికల షెడ్యూలును ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి మాత్రమే ఉందని, ఇతరులు అందులో జోక్యం చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జ్యోతిషాలు, భవిష్యవాణిల ఆధారంగా ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకోదని విస్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’ సహా వివిధ ప్రసార మాధ్యమాలతో తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ‘ఒక దేశం-ఒక ఎన్నిక’ అంశం పరిధిలోకి తెలంగాణ ఎన్నికలు రావన్నారు. జమిలికి తాము మద్దతిస్తున్నట్లు తెరాస ఇటీవల ప్రకటించిందని, కానీ ఇప్పుడు అంతకుముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

తెలంగాణ ఎన్నికలపై నిర్ణయమెప్పుడు?
2002లో రాష్ట్రపతి చేసిన ప్రతిపాదనపై సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ ప్రకారం- ఏదైనా అసెంబ్లీ గడువుకు ముందే రద్దయితే ఎన్నికలసంఘం తొలుత దానికి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. ఆపద్ధర్మ ప్రభుత్వానికి అనుచిత లబ్ధి చేకూర్చకూడదు. ఎన్నికల నిర్వహణకు ఆరునెలల సమయం ఉందన్న ఉద్దేశంతో అపద్ధర్మ ప్రభుత్వానికి అప్పటివరకూ పరిపాలించే అవకాశం ఇవ్వొద్దని కోర్టు చెప్పింది. చిన్నపాటి విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను ఆలస్యం చేయవద్దనీ, దానివల్ల అపద్ధర్మ ప్రభుత్వం బాధ్యతారహితంగా పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుని, భారీగా డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలను ప్రభావితంచేసే ప్రమాదం ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అందువల్ల... తొలుత సుప్రీం రూలింగ్‌ను, తర్వాత ఎన్నికల సన్నద్ధతను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ విషయంలో ఓ నిర్ణయానికి వస్తాం. తెలంగాణ శాసనసభ అకస్మాత్తుగా రద్దయిన క్రమంలో.. సీఈవో ద్వారా నివేదిక తెప్పించుకుంటున్నాం. ఎన్నికలకు ఎంతవరకూ సమాయత్తమై ఉన్నారు, పెండింగ్‌ అంశాలేంటి, వాటికి ఎంత సమయం పడుతుందన్న వివరాలు తెలుసుకుంటున్నాం.

సుప్రీంకోర్టు రూలింగ్‌ ఇచ్చిన తర్వాత... అదే ఏడాది గుజరాత్‌ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఆరు నెలల సమయం తీసుకొంది. 2003లో చంద్రబాబునాయుడు అసెంబ్లీని రద్దుచేసి ముందస్తుకు వెళ్లినప్పుడూ ఆరు నెలలకుపైగా సమయం తీసుకొంది కదా?
ఇతర అంశాల పేరుచెప్పి ఎన్నికలను ఆలస్యంచేస్తే కీలకమైన ఆర్ధిక, పరిపాలనపర నిర్ణయాలు తీసుకునేలా ఆపద్ధర్మ ప్రభుత్వానికి అవకాశమిచ్చినట్లవుతుంది. ఆరోజు ఆరు నెలల సమయం ఎందుకు తీసుకున్నారన్నది ఈరోజు సమీక్షించలేం. గతం గతః. అప్పటి పరిసితుల గురించి ఎవ్వరికీ పూర్తిసాయి వాస్తవాలు తెలియవు.

నాలుగు రాష్ట్రాలతో కలిపి నిర్వహించే అవకాశం ఎంతవరకు ఉంది?
నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తామని కచ్చితంగా చెప్పలేం. జ్యోతిషాలు, భవిష్యవాణిలు ఇక్కడ పనిచేయవు. ఎన్నికల సంఘం చట్టబద్ధంగా వెళ్తుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిజాయతీగా, విశ్వసనీయంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. రాజసాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంలో ఎన్నికల సన్నద్ధత టాప్‌గేర్‌లో ఉంది. అక్కడ ఏర్పాట్లు ముందస్తు దశలో ఉన్నాయి. తెలంగాణ యంత్రాంగ ఎన్నికల సన్నద్ధత వేగంగా ఉందా? తక్కువ సమయంలో ఆ నాలుగు రాష్ట్రాలను అందుకోగలదా? అని చూడాల్సి ఉంటుంది. వాటిని అందుకోగలిగితేనే తెలంగాణలోనూ వాటితో కలిపి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుంది. ఆ రాష్ట్రాలపై అధికారుల స్థాయి సమీక్ష పూర్తయింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో పరిసితులపై ఎన్నికల సంఘం సమీక్ష కూడా పూర్తయింది. ఆ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను తగిన సమయంలో ప్రకటిస్తాం. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను మా సమీక్ష ఆధారంగా నిర్ణయిస్తాం. ఒకవేళ ఎన్నికల సన్నద్ధత పూర్తిసాయిలో ఉంటే... అప్పుడు తప్పనిసరిగా సుప్రీం ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు అవకాశాలుంటే సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కోర్టు చెప్పింది. అందువల్ల సన్నద్ధత బాగుంటే ఎన్నికల సంఘం తక్షణం నిర్ణయం తీసుకుంటుంది. అన్నీ బాగుంటే నాలుగు రాష్ట్రాల కంటే ముందే తెలంగాణకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇబ్బందేంలేదు. ఏర్పాట్లన్నీ బాగున్నాయి, ఎవరి జోక్యం లేదని నిర్ధారించుకున్న వెంటనే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటివరకు కొన్ని నివేదికలు వచ్చాయి. కానీ వాటిని ఇంకా పూర్తిగా చూడలేదు. అందులోని అంశాలు సమగ్రంగా ఉన్నాయా? లేదా? అన్నది తెలియదు. వచ్చేవారం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారిని పిలిపించి మాట్లాడతాం.
తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన సమస్యలేంటి?
ధన ప్రభావం అధికంగా ఉంటుంది. ఉచిత వరాలు, డబ్బుల పంపిణీ, నగదు దుర్వినియోగంపై విస్తృతసాయిలో నిఘా ఉంచాల్సి వస్తుంది. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల వరకు ఎలాంటి సమస్యా లేదు. డిసెంబరులోగా ఎన్నికలు నిర్వహించడమన్నది స్థానిక యంత్రాంగం సన్నద్ధతను బట్టి ఉంటుంది.
కేసీఆర్‌ ప్రకటించారు కదా?
నవంబరులో ఎన్నికలు, డిసెంబరులో ఫలితాలంటూ కేసీఆర్‌ మాట్లాడటం గర్హనీయం. వ్యక్తులు, రాజకీయ నాయకులు, భవిష్యవాణిల ప్రకారం ఎన్నికల సంఘం నడుచుకోదు. ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిసితుల్లోనూ కమిషన్‌ సమర్థించదు. ఇదెంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎన్నికల నిర్వహణకు క్షేత్రసాయి యంత్రాంగం ఎంతవరకూ సన్నద్ధంగా ఉందన్న విషయాన్ని కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంటుంది. గత సాయంత్రమే అసెంబ్లీ రద్దు గురించి సీఈవో సమాచారం అందించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా స్థాయిల్లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత ఏ విధంగా ఉందన్న అంశంపై నివేదిక ఇవ్వమని ఆదేశించాం. దాని ఆధారంగా పరిస్థితులను అంచనావేసి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నదానిపై కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికలు ఫలానా నెలలో జరుగుతాయి, ఫలానా నెలలో ఫలితాలు వస్తాయని బయటివారు చెప్పడం చాలా అర్థరహితం. ఈ అంశంపై ఎన్నికల సంఘం మినహా... మరెవరూ మాట్లాడకూడదు. రాజ్యాంగం, చట్టప్రకారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదలచేసే అధికారం కేవలం ఎన్నికల సంఘానికే ఉంది. అది పూర్తిగా ఎన్నికల సంఘం విశేషాధికారం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎవ్వరూ అందులో వేలు పెట్టకూడదు. షెడ్యూల్‌పై మేం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారా బహిరంగపరుస్తాం.

కేసీఆర్‌ మీతో మాట్లాడామని చెబుతున్నారు..?
లేదు. ఆయన నన్నెప్పుడూ కలవలేదు. నాతో మాట్లాడనూ లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నన్ను కలిశారు. మాజీ ప్రధాన కార్యదర్శి, ఇతర కమిషన్‌ సభ్యులతో సమావేశమయ్యారు. అందరితో కలవడం, అభిప్రాయాలు వినడం మా బాధ్యత. అందులో భాగంగానే అధికారులు వచ్చి కలిశారు. కమిషన్‌ ఎప్పుడూ ఊహాజనితమైన పరిస్థితులను బట్టి హామీలు ఇవ్వదు. అసెంబ్లీ రద్దయింది కాబట్టి మేం ఎన్నికల సన్నద్ధతను అంచనావేసి షెడ్యూల్‌పై ఒక నిర్ణయానికి వస్తాం.

30 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారని శశిధర్‌రెడ్డి ఆరోపించారు కదా? దాన్ని సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
భాగస్వాములందర్నీ సంతృప్తిపరచడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. అన్ని ఫిర్యాదులనూ పరిశీలించి పరిష్కరిస్తుంది. మా ముందుకొచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకుండా ఎన్నికలకు వెళ్లం. ఓటర్ల జాబితా సవరణ నిరంతరాయంగా కొనసాగుతుంది. నామినేషన్ల చివరి రోజు వరకూ జాబితాలో పేర్లు చేర్చుకోవడానికి ఓటర్లకు అవకాశముంటుంది. ఆ తర్వాత వాటిని తనిఖీ చేయడానికి సమయం ఉండదు కాబట్టి అంతకు పదిరోజుల ముందు వరకు పేర్లు నమోదు చేసుకోవడానికి గడువిస్తాం.

పోలవరం ముంపు మండలాల సమస్య ఇంకా ఉందా?
ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఏడు మండలాలకు సంబంధించిన సమస్యను ఇంకా పరిష్కరించాల్సి ఉంది. ఆ ప్రకారం తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను సవరించాల్సి ఉంటుంది. చాలా ముఖ్యమైన ఈ అంశాన్ని చాలామంది మరిచిపోయారు. అది హోంశాఖ దగ్గరుంది. దానిపై కొన్ని నెలలుగా కమిషన్‌ మాట్లాడుతోంది. త్వరలో దానికి పరిష్కారం లభిస్తుందని రెండురోజుల క్రితం మాకు సమాచారం అందింది. ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉంది. అందువల్ల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుందని అనుకోవడంలేదు.

అసలు సమస్య ఏంటి? దీనికి ఇంకెంత సమయం పడుతుందనుకుంటున్నారు?
రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రలో, మూడు మండలాలను ఆంధ్ర నుంచి తెలంగాణలో కలిపారు. అప్పుడు విడుదలచేసిన హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌లో కొన్ని చిన్నచిన్న తప్పులున్నాయి. వాటికి సవరణలను విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నందున.. అతి త్వరలో పూర్తిచేస్తామని మాకు వాగ్దానం చేశారు. సవరణ జారీకి మళ్లీ పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరంలేదు. హోంశాఖ కార్యనిర్వాహక ఉత్తర్వులు సరిపోతాయి.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణలోకి ఎలాంటి మండలాలూ కలవలేదు. కేవలం తెలంగాణ నుంచే ఆంధ్రలో కలిశాయి కదా?
అయితే అదే కావచ్చు.

ఎన్నికల సమాయత్తానికి ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు?
సుమారు 145 అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. ఎన్నికలకు వెళ్లడానికి ముందు అవన్నీ పూర్తికావాలి. ఓటర్ల జాబితా, ఈవీఎంలు, పోలింగ్‌ సిబ్బంది, రవాణా, వాతావరణం, ఇతర అంశాలన్నీ పరిశీలిస్తాం. ఇందుకోసం కచ్చితమైన క్యాలెండర్‌ను రూపొందించాం. అందులోని ప్రతి అంశాన్నీ పూర్తిచేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం.

ఎంతమంది భద్రతా సిబ్బంది అవసరం?
అవన్నీ తదుపరి దశలో వస్తాయి. ఫలనా సమయంలో ఎన్నికలు నిర్వహించాలని సంఘం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చిన తర్వాత మిగిలిన అంశాలన్నీ పరిగణలోకి వస్తాయి. ఎన్నికలకు తాము సిద్ధమని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి నివేదిక పంపారు. అందువల్ల వారు చెప్పిన అంశాల్లో ఎంతవరకు నిజం ఉందో పరిశీలించి ఆడిట్‌ చేయడానికి 11న ఇక్కడి నుంచి ఒక బృందాన్ని పంపుతున్నాం.

11న తెలంగాణకు వెళ్లే బృందం నివేదిక ఇవ్వడానికి ఎంత సమయం తీసుకుంటుంది?
రెండు రోజులు చాలు. బుధ, గురువారం రాత్రికల్లా నివేదిక ఇస్తుంది. ఒకసారి ఎన్నికల తేదీలపై నిర్ణయం వచ్చాక తొలుత అధికారులు, తర్వాత కమిషన్‌ ఆ రాష్ట్రానికి వెళ్లి పరిశీలిస్తుంది. తర్వాత ఎన్నికలు జరుగుతాయి.

మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబరు 15తో ముగిస్తే, మిగతా మూడు రాష్ట్రాలకు జనవరి 20 వరకు గడువుంది. మిజోరాంను డీలింక్‌ చేసి దానికి తొలుత ఎన్నికలు నిర్వహించి, మిగిలిన మూడు రాష్ట్రాలతో పాటు, తెలంగాణకూ ఎన్నికలు నిర్వహించే అవకాశముందా?
రాజస్థాన్‌కు జనవరి 20 వరకూ సమయమున్నా... ఛత్తీస్‌గఢ్‌కు జనవరి 5తో, మధ్యప్రదేశ్‌కు జనవరి ఏడుతో గడువు ముగుస్తుంది. ఎన్ని రాష్ట్రాలను డీలింక్‌ చేసుకుంటూ వెళ్తాం? ఒక రాష్ట్రాన్ని డీలింక్‌ చేస్తే మీడియా మొత్తం మమిల్ని ప్రశ్నిస్తుంది. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల సమయంలో
అదే జరిగింది. మేం అలాంటి నిర్ణయాలకు వెళ్లం. అలా ఎందుకు చేయాలో చెప్పండి?
తొలుత నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలను నిర్వహించి, ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలకు వెళ్తే వీటి ఫలితాలు ఆ ఎన్నికపై ప్రభావం చూపవా?
ఆ అన్ని అంశాలనూ దృష్టిలో పెట్టుకొనే కమిషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ను రూపొందిస్తుంది.

షెడ్యూల్‌ విడుదల, అసెంబ్లీ రద్దుకు మధ్య నిర్దిష్ట గడువు ఉండాలా?
అలాంటిదేం లేదు. 1/2002 సుప్రీంకోర్టు కేసు ప్రకారం... రద్దయిన అసెంబ్లీకి తొలి అవకాశంలోనే ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఎన్నికల నిర్వహణకు కనీసం 32 రోజుల సమయముంటే సరిపోతుంది. పది రోజులు నామినేషన్‌కు, 14 రోజులు ప్రచారానికి, 3, 4 రోజులు కౌంటింగ్‌కు సమయం కావాల్సి ఉంటుంది. చట్టబద్ధంగా ఈ సమయం ఉంటే చాలు. మిగిలిన సమయం అంతా సౌకర్యవంతంగా ఎన్నికలు నిర్వహించడానికే. ఎన్నికల నిర్వహణలో మేం జాప్యంచేస్తే.. ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఆర్థిక, పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా అనవసరంగా అవకాశం కల్పిస్తున్నారని మమ్మల్నే నిందిస్తారు. ఆపద్ధర్మ ప్రభుత్వం విధానపర నిర్ణయాలు తీసుకోకుండా ఎవ్వరూ ఆపలేరు. డబ్బు ఖర్చుచేయొచ్చు. నిర్ణయాలూ తీసుకోవచ్చు. వాటిని ఎవ్వరూ నిలువరించలేరు.

4 రాష్ట్రాలకు ఒకసారి, తెలంగాణకు మరోసారి నిర్వహించే వీలుందా?
పరిశీలన నివేదిక రాకుండా ఇప్పుడే నేనేమీ వ్యాఖ్యానించలేను. సమయం ఉంది కాబట్టే కమిషన్‌ అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆప్షన్స్‌ అన్నీ ఓపెన్‌గా ఉన్నాయి. వారం పది రోజుల్లో ఒక నిర్ణయానికి వస్తాం. ఆరునెలల్లోపు ఎన్నికలు నిర్వహించడం మా బాధ్యత. సాధ్యమైనంత త్వరగా దాన్ని పూర్తిచేస్తాం.
పాత ఓటర్ల జాబితా అంశం సమస్యకాదా?
ఏ ఓటర్ల జాబితా ప్రకారం వెళ్లాలన్నదానిపై ఎలాంటి విచక్షణా లేదు. ఏ సంవత్సరం ఎన్నికలకు వెళ్తే ఆ సంవత్సరం జనవరిలో ముద్రించిన తుది ఓటర్ల జాబితా చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా ఎన్నికలను పూర్తిచేయగలిగితే ఈ ఏడాది జనవరిలో రూపొందించిన ఓటర్ల జాబితా సరిపోతుంది. ఒకవేళ జనవరి, ఫిబ్రవరిల్లో ఎన్నికలుంటే- 2019 జనవరిలో ముద్రించే జాబితాను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 31లోపే ఎన్నికలను నిర్వహించగలిగేట్లయితే పాత జాబితా ప్రకారమే వెళ్లవచ్చు. ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా అంశం సమస్య కాదు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడానికి అందరికీ అవకాశం కల్పిస్తాం. ఎవ్వరూ ఓటు హక్కును కోల్పోకూడదన్నదే మా ఉద్దేశం.

Comments

Popular posts from this blog

Thugs Of Hindostan - full movie | Amitabh Bachchan | Aamir Khan | ...

తెలంగాణ నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశముంది. కేసీఆర్‌ telangana elections 2018 | kcr |